ప్రపంచాన్నే కుదిపేస్తున్న కరోనా ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడుతోంది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో పాఠశా లలను తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఆన్‌లైన్ బోధన పేరిట ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీకి తెర తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పదో తరగతిలోపు విద్యార్థులను తర్వాతి క్లాసుల్లోకి ప్రమోట్ చేయగా.. పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను మన రాష్ట్రంలో ఏకంగా రద్దు చేసి, అందరినీ పాస్ చేశారు. అంతే కాకుండా ప్రవేశ పరీక్షల గడువు, ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలను కూడా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం ఎప్పుడనేది అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఆగస్టు మూడో తేదీ నుంచి రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించనున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాత్రం ఆగస్టు 16 వరకూ పాఠశాలలను తెరిచే ఆలోచన పెట్టుకోవద్దని రాష్ట్రాలకు సూచిస్తోంది.
సాంకేతిక విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15 నుంచి..
వృత్తి విద్య, సాంకేతిక కోర్సులైన ఫార్మసీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు బోధించే సాంకేతిక విద్యా సంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన అకడమిక్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి, మిగిలిన వారికి ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, కరోనా ప్రభావం దృష్ట్యా కొత్త క్యాలెండర్ ను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాల్సిన నేపథ్యం ఉండటంతో వారరికి సెప్టెంబర్ 15 నుంచి, మిగిలిన వారికి ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది.
పనిదినాల తగ్గింపు, సిలబస్‌లో కోత..
విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు నష్టపోకుండా అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అందులో భాగంగా పని దినాలను కుదించడం, సిలబస్‌ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు విద్యార్థులకు ఇప్పటికే దూరదర్శన్, ఎఫ్‌ఎం రేడియో, యూట్యూబ్ ఆధారిత పాఠాలను విద్యాశాఖ బోధిస్తోంది. అయితే, అవి తరగతి గది బోధనతో సమానంగా ఉండవనే అభిప్రాయాల నేపథ్యంలో వాటిని అలాగే కొనసాగిస్తూ.. బడులు తెరుచుకున్న తర్వాత సవరించిన సిలబస్‌ను పూర్తి స్థాయిలో విద్యార్థులకు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆగస్టు 3 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినా కరోనా ఉధృతిని బట్టి ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించే అవకాశమూ లేకపోలేదు. అంతే కాకుండా విద్యా సంవత్సరాన్ని వచ్చే ఏడాది మే రెండో వారం వరకూ కొనసాగించాలని ప్రాథమికంగా భావిస్తోంది. మధ్యలో సెలవులు ఎక్కువగా వచ్చే పండుగలైన దసరా, సంక్రాంతి సెలవులను తగ్గించి, కనీసం 180 పని దినాలు ఉండేలా మార్పులు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయ అంచనాకు వచ్చింది. అలాగే సిలబస్‌ను దాదాపు 30 శాతం తగ్గించి, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పాఠ్యాంశాల కూర్పుపై ఎస్‌సీఈఆర్‌టీ, నిపుణులు, అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా మార్చిలో నిర్వహించే పది పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో, ఆరు నుంచి తొమ్మిదో తరగతుల పరీక్షలను మేలో నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే విద్యా క్యాలెండర్ ను, సిలబస్ కరిక్యులంను సిద్ధం చేసి త్వరలో విద్యాశాఖ విడుదల చేయనుంది.
-సన్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర సహాధ్యక్షులు, ఏపీటీఎఫ్ (1938)