సాహితీ యాత్రా క్షేత్రం విశాఖపట్నం
జూలై5 రచయిత వడ్డాది జయంతి సందర్భంగా రాశే మాట...
#ఎందరో సాహితీవేత్తలకు విశాఖపట్నం యాత్రా క్షేత్రంగా నిలిచింది. ఇంతకీ ఈ సాహిత్య పట్నం నుంచి ఎవరెవరు మెరిశారు ? వారి స్ఫూర్తి ఎలా కొనసాగింది ? అన్న వివరాలను మననం చేసుకుంటూ.... ఒక గేయంతో రచయిగా ప్రసిద్ధి చెందిన వడ్డాది సీతారామాంజనేయులు జయంతి (1900 జూలై 5 న జననం) సందర్భంగా... రాశే మాటగా ఒక పరామర్శ.... విశాఖపట్నంలో... జాతీయోద్యమం రోజుల్లో.... 'మాకొద్దీ తెల్లదొరతనము' గీతమంతటి ప్రచారాన్ని పొందిన 'దండాలు భారతమాత' అనే పాట రాసిన ప్రసిద్ధ రచయిత వడ్డాది సీతారామాంజనేయులు . విశాఖలో
కవితా సమితి ఆవిర్భావంలో ఆయన భాగస్వామి కూడా.
1921 నుంచి విశాఖపట్నంలో జాతీయోద్యమం చాలా ముమ్మరంగా సాగుతూ సాహిత్య కృషి సైతం జరిగేది. ఎన్ని సాహిత్య సంస్థలున్నా... కొన్నిటికే ప్రత్యేకత ఉంటుంది. విశాఖ ప్రాంతాన్ని సాహితీ పరంగా ఒక ఊపు ఊపిన సాహితీ సంస్థ కవితా సమితి. ఎందరో కవుల్ని, రచయితల్ని, పరిశోధకుల్ని అందించిన ఈ సాహిత్య సంస్థకు రథసారధిగా పేరుపొందిన మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు శాశ్వత అధ్యక్షులుగా కొనసాగేరు. పురిపండా అప్పలస్వామి కార్యదర్శిగా ఉండేవారు. ఈ సంస్థను స్థాపించిన వారిలో వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు వారి అనుయాయులు... పురిపండా అప్పలస్వామి, రెండవ వారు ఈ శతాబ్దం నాదన్న మహాకవి శ్రీశ్రీ, మూడవ వ్యక్తి 'దండాలు మా భారతమాత' వంటి దేశభక్తి గీతాలను రాసిన స్వరాజ్య కవి వడ్డాది సీతారామాంజనేయులు. ఈ కవితా సమితి 1926 మే 6న స్థాపితమైంది. శ్రీశ్రీ యుగకర్తగా మారటానికి ఈ సంస్థే ప్రేరణనిచ్చింది. విశాఖపట్నంలో వందేళ్ళ కిందట ఆచంట వేంకట రామా సాంఖ్యాయన శర్మ 'కల్పలత' అనే పత్రిక పెట్టి ఉత్తమ అభిరుచులను కల్పించారు. ఈ పక్రియలోనే మొట్టమొదటి ఆధునిక కథానిక గురజాడ అప్పారావు కంటే ముందుగా ఇక్కడ వెలువడింది. వ్యవహారిక భాషావాదానికి అంకురార్పణ జరిగింది ఇక్కడే. పి.టి.శ్రీనివాస అయ్యంగారు, ఏల్స్ దొర కలిసి విశాఖపట్నంలోనే వాడుక భాష గురించి మొదట చర్చించారు. గిడుగు రామ్మూర్తి ఉపాధ్యాయ పరిషత్‌లో భాషా శాస్త్రం గురించి ఉపన్యాసాలను ఇస్తూ... భాషాతత్వాన్ని అధ్యయనం చేశారు...విశాఖపట్నంలోనే. ఎందరు కవులున్నా 'కవిగారు' ఒక్కరే!. ఆయనే మారేపల్లి రామచంద్రశాస్త్రి. ఆయన రాజమండ్రి నుంచి చదువుకునేందుకు వచ్చి పి.టి.శ్రీనివాస్ అయ్యంగారి చేత కవి అనిపించుకుని విశాఖపట్నంలోనే స్థిరపడి మొత్తం దేశమంతటా ఆనాడు కవిగారుగా గౌరవాన్ని పొందేరు. శెట్టి లక్ష్మీ నరసింహం, విక్రమ దేవవర్మ ఆదిలో నాటక సమాజాలను స్థాపించారు. ఎన్నో నాటకాలను ఆడారు. పురిపండా అప్పలస్వామి ఈ దశలోనే ఖాదీ ప్రచారకుడుగా, కాంగ్రెస్ కార్యకర్తగా, కవిగా రంగ ప్రవేశం చేశారు. ఆరోజుల్లో విశాఖజిల్లాలో ఉన్న సాహితీపరులంతా కవితా సమితి సభ్యులే. శ్రీరంగం నారాయణబాబు, పుడిపెద్ది వెంకటరమణయ్య, కాలూరి వెంకట నరసింహారావు మొదలైన ఉత్తమ కవులంతా ఈ సాహిత్య వాతావరణంలోనే పెరిగారు. కవితా సమితి ప్రథమ కుసుమంగా శ్రీశ్రీ రచించిన 'ప్రభవ' అనే కావ్య సంకలనం అచ్చయింది. కవితా సమితి వార్షికోత్సవాలు చాలా ఉత్తేజంగా జరిగేవి. అఖిలాంధ్ర కవుల ఛాయా చిత్ర ప్రదర్శనను పురిపండా అప్పల స్వామి కవితా సమితి తరపున ఏర్పాటు చేశారు. దీన్ని మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రారంభించారు. భీమునిపట్నంలో జరిగిన కవితా సమితి వార్షికోత్సవంలో గిడుగు రామ్మూర్తి వెలుగులోకొచ్చారు. ఎయు నుంచీ... సాహిత్య వీచికలు ఎన్నో వీచేయ్...
కవితా సమితి ఆవిర్భవించిన కొత్తలో 1926లో ఆంధ్ర విశ్వ విద్యాలయం కూడా వచ్చింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులే కాకుండా, విద్వాంసులు కూడా అక్కడికి చేరడంతో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఇంగ్లాండ్ నుంచి వస్తూ తమతో ఆధునిక సాహిత్యాన్నీ తీసుకు వచ్చి ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పెట్టడం వల్ల యువకులకు లాభించింది. ప్రొఫెసర్ వీరేంద్రనాథ్ ముఖర్జీ, అబ్బూరి రామకృష్ణారావు వంటి వారు ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని యువకులను అధ్యయనం వైపు మళ్లించారు. చండ్ర రాజేశ్వరరావు, నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, నిడమర్తి ఉమా రాజరాజేశ్వరరావు మొదలైన వారు విద్యార్థి ఉద్యమాన్ని విశాఖపట్నంలోనే నిర్మించడం వల్ల చాలా చక్కని సామ్యవాద పునాదులతో రచయితలు తయారవడానికి ఆస్కారం కలిగింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసిన సభలకు దేశంలో పేరుమోసిన కవులందరూ వచ్చిపోతూ ఉండడం వల్ల విశాఖపట్నంలో నిత్య సాహిత్య రుతువు కొనసాగుతూ కనబడేది. ఇటువంటి వాతావరణంలోనే శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) తన మహాప్రస్థానం గేయాల రచన ప్రారంభమయింది. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో చదువుకునేందుకు వచ్చిన బాలాంత్రపు రజనీ కాంతారావు, భద్రిరాజు కృష్ణమూర్తి మొదలైన వారు సంగీత సాహిత్య రంగాలలో, భాషా శాస్త్ర రంగాలలో ప్రామాణికులయ్యారు. రాచకొండ విశ్వనాథశాస్త్రి, కాళీపట్నం రామారావులు విశాఖ మాండలీకాన్ని తమ కథల్లోనూ చొంపించారు. ఇటువంటి సాహిత్య వాతావరణంలో .... అల్లసాని పెద్దన చెప్పినట్టు... 'అచట పుట్టిన చివురు కొమ్మయినా... చేవ' అన్న స్ఫూర్తి విశాఖపట్నంలో నేటికీ కూడా కొనసాగుతూనే వుంది....
-సన్నశెట్టి రాజశేఖర్, ఎడిటర్ - ఉత్తరాంధ్ర, 94404 36703