Sep 30, 2020

పీఆర్సీ నివేదిక సమర్పణకు ఇంకెంత సమయం కావాలి?* *ఏపీటీఎఫ్ నాయకుడు సన్నశెట్టి ప్రశ్న రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన కమిటీ గడువు రెండున్నరేళ్లు గడిచినా ఇంకా నివేదిక సమర్పించకపోవడం ఏమిటని ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు శ్రీకాకుళం జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్ ప్రశ్నించారు. ఈ కమిటీ గడువును అయిదు దఫాలుగా పెంచుతూ సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ పొడిగింపులు ఏమిటని ఆయన నిలదీశారు. దీని వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని , ప్రభుత్వం వేతన సవరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలో ఇటీవల నిర్వహించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర ఎన్నికల్లో భారతదేశ స్థాయిలో అనుబంధంగా వున్న అఖిల భారత విద్యా సంస్థల సమాఖ్యకు కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఆయన శ్రీకాకుళంలో మాట్లాడారు. 2018 జులై నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉందన్నారు. భారతదేశ రాజ్యాంగ రచన కన్నా పీఆర్సీ నివేదికకు ఎక్కువ సమయం తీసుకోవడం సరికాదని సన్నశెట్టి విమర్శించారు. గడిచిన 10 వేతన సవరణ సమయాల్లో ఎప్పడూ ఇలాంటి పరిస్థతి లేదన్నారు. ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం 5 కరవు భత్యాల అమలు బకాయి ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పరిస్థితి గమనించి ఇంతకాలం ఉద్యోగులు కూడా ఓపిక పట్టారని, ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఈ విషయం గుర్తించి రాష్ర్ట ప్రభుత్వం డీఏలను విడుదల చేయాలన్నారు. ఆరోగ్య కార్డుల విషయంలోనూ ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని రాజశేఖర్ కోరారు. డిపార్టుమెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు తొలగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.