Oct 5, 2020

ఎన్.ఈ.పి ని వ్యతిరేకించండి -ఏపీటీఎఫ్ శ్రేణుల నిరసన* *కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రకటించిన 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రజలు వ్యతిరేకించాలని ఏపీటీఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా.... అఖిల భారత విద్యా సంఘాల వేదిక (AIFRTE) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో (ఈరోజు) నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యనిర్వహణ సమితి చేసిన నిర్ణయం ప్రకారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం కూడలి వద్ద ఫెడరేషన్ నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. దేశంలోని మేధావుల, విద్యావేత్తల, ఉపాధ్యాయ సంఘాల, విద్యారంగ వేదికల అభిప్రాయాలనూ, సూచనలనూ తీసుకోకుండా జూలై 29న ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వ పాలకులు నూతన విద్యా విధానాన్ని ప్రకటించడాన్ని వారు నిరసించారు. AIFRTE భాగస్వామి సంఘంగా ఏపిటీఎఫ్ ఈ పోరాటంలో ఉందని అన్నారు. 70 ఏళ్ల చరిత్రలో పార్లమెంట్ ప్రమేయం లేకుండా NEP ని ప్రకటించడం ఇదే ప్రథమం. స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు,సహోదరత్వం, వైవిధ్యంలో ఐక్యత, ఫెడరలిజం ,సామ్యవాదం, లౌకికవాదం, శాస్ర్తీయ దృక్పథం వంటి సామాజిక విలువలపై నూతన విద్య విధానం రూపొందలేదు. ఈ విధానం నేడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసేదిగా కాకుండా, కొత్త సమస్యలను సృష్టించేదిగా వుందని విమర్శించారు. విద్యా విధానంలో కేంద్రం తానే ఆధిపత్యం వహించే విధంగా వుందనీ రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తుందనీ ప్రస్తుతం మృత భాషగా వున్న సంస్కృతాన్ని తెరపైకి తేవడం, ప్రాచీనకాలంలో వున్న కుల వృత్తులను కోర్సుల పేరట ప్రవేశపెట్టి వివక్షతకు తావిచ్చే విధానాలు ఈ NEPలో ఉన్నాయన్నారు . దేశంలో ఎన్ ఈ పీ పై అభిప్రాయాలు చెప్పొచ్చని, వ్యక్తిగతంగా టీచర్, ప్రొఫెసర్, ప్రిన్సిపల్స్ పాఠశాల, కళాశాలల ద్వారా యూ డైస్ ద్వారా నెట్ లోనే జవాబులను రాసే విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వ వైఖరి బయటపడిందని అన్నారు. ఈ నిరసనలో ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు, జిల్లా గౌరవాధ్యక్షులు సన్నశెట్టి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కవిటి పాపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి టెంక చలపతిరావు, జిల్లా సహాధ్యక్షులు బల్లెడ రవి పాల్గొన్నారు*