Oct 8, 2020

ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త

 *ఉద్యోగులకు ఇది శుభవార్త కాదు.... నిరాశే...!*



*ఒకే ఒక్క డీఏ...పెండింగు జీతాలు 5 నెలల్లో.... పిడులాంటి వార్త*


*రాశే మాట*


*ఉద్యోగుల పెండింగు సమస్యలపై తన కార్యాలయ ఉన్నతాధికారులతో చర్చించిన  ముఖ్యమంత్రి జగన్ బుధవారం రెండు నిర్ణయాలను తీసుకున్నారనే కబురు మీడియాలో వైరల్ అయింది.  రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు  పెండింగులో ఉన్న అయిదు డీఏలలో ఒక డీఏ, కరోనా వల్ల కోత పెట్టిన రెండు నెలల సగం జీతాలు అయిదు విడతల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని ఆ వైరల్ సమాచారం.  ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి  కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉద్యోగ సంఘ నాయకులకు  ఈ విషయం తెలియజేయడంతో  ఆ వార్త బయటకు వచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటం, కరోనా నేపథ్యంలో ఉద్యోగుల ఖర్చులు పెరగడం, డీఏల కోసం  ఎదురుచూసిన పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించే  ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూడటం సహజం.  నిజానికి పెండింగు జీతాలు, కరవు భత్యం కూడా ఉద్యోగులకు తప్పనిసరిగా అమలు చేయాల్సినవే. ఒకప్పుడు  రాష్ర్ట మంత్రిమండలి సమావేశంలో డీఏ ప్రకటిస్తే  ఉద్యోగులు అది సాధారణ వార్తగానే భావించేవారు.  ప్రస్తుత పరిస్థితిలో అదే కాదు- వారి జీతంలో కోత కోసిన మొత్తం తప్పనిసరిగా వస్తుందని  తెలిసి కూడా  ఎప్పుడు ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటిది ముఖ్యమంత్రి ఉద్యోగుల  అంశాలపై  దృష్టి సారించి నిర్ణయం తీసుకోబోతున్నారన్న అంశంపై  వారు ఆసక్తిగా దృష్టి సారించారు.  చివరికి వెలువడిన ఆ  రెండు నిర్ణయాలూ నిరాశే మిగిల్చాయి.*

*ప్రతి ఆరునెలలకు ఒకసారి రాష్ర్ట ప్రభుత్వం కరవు భత్యం ప్రకటిస్తూ ఉంటుంది. ధరల సూచీ  ఆధారంగా అది ఎంత శాతమో నిర్ణయించి  ప్రకటిస్తుంటుంది. సాధారణంగా  కేంద్ర ప్రకటన తర్వాత రాష్ర్టంలోనూ వెలువడుతూ ఉంటుంది.  2‌018 జులై ఒకటి నుంచి 2020 జులై వరకు మొత్తం అయిదు డీఏలు ప్రకటించాల్సి  ఉందని ఉద్యోగ సంఘాల JAC కోరిక.   ఈ అయిందింటిలో ప్రస్తుతం ఒకటి ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసిందని నీరుగార్చే కబురు.  కనీసం మూడు డీఏలైనా ప్రకటించాలని  ఉద్యోగ వర్గాల మనో భావం.*


*ఇక పెండింగు జీతాల సంగతి...*


*మార్చి ,ఏప్రిల్ నెలలకు సంబంధించి  ఉద్యోగులకు 5‌0శాతం జీతాలు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు ఒక నెలకు సంబంధించిన సగం పెన్షన్ ఇవ్వాల్సి  ఉంది. ఇప్పటికే సగం మొత్తం  చెల్లించారు. మిగిలిన సగంలో జీపీఎఫ్, ఇన్ కం టాక్సు, జీఎల్ఐ తదితరాలు మినహాయించుకుని మిగిలిన మొత్తం ఇవ్వాల్సి ఉంది.  ఈ కోణంలో చూసినప్పుడు  ఉద్యోగులకు ఇక నేరుగా నగదు ప్రయోజనం అందేది  తక్కువే. అదీ అయిదు విడతల్లో అంటే ఉద్యోగులు ఉసూరు అనకుండా ఉంటారా.  ఇది ‘ఇస్తినమ్మ వాయినం-పుచ్చుకుంటునమ్మ వాయినం’ అన్నట్లు ఉందని  ఉద్యోగ బృందం వాదన.*


*-సన్నశెట్టి రాజశేఖర్, ఐఫియా కౌన్సిల్ సభ్యుడు, 94404 36703*